- బీఆర్‌ఎస్ హయాం నుంచే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నరు
- సనాతన సింధూ సత్సంగ్ ట్రస్ట్ చైర్మన్ స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి ఆరోపణ
పంజాగుట్ట, వెలుగు : ‘భద్రాచలంలో సీతారాముల కల్యాణానికి బదులు లక్ష్మీనారాయణుల కల్యాణం చేస్తున్నరు, ఇది హైందవ ధర్మాన్ని, శ్రీరాముడి భక్తులను మోసం చేయడమే’ అని సనాతన సింధూ సత్సంగ్ ట్రస్ట్ చైర్మన్ స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి అన్నారు. బీఆర్‌ఎస్ హయాం నుంచే ఇలాంటి కల్యాణ ఘట్టాన్ని కొనసాగిస్తున్నారని, అడ్డు చెప్పిన వారిపై క్రిమినల్ కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు.
హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైందవ మతంలోని కొందరు స్వామీజీల ప్రోద్బలంతో శ్రీరాముని కల్యాణం స్థానంలో లక్ష్మీ నారాయణుల కల్యాణం జరుపుతున్నారని, ఈ విషయంపై దేవాదాయ శాఖ, ప్రభుత్వ సలహాదారులను కలిసినా పరిస్థితి మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
విష్ణుమూర్తి కల్యాణం జరపాలనుకుంటే.. ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని గానీ శ్రీరాముని కల్యాణం పేరుతో విష్ణు కల్యాణం చేయడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. ఈ విషయంపై కోర్టులో కేసు వేసినప్పటికీ.. కోర్టుకు సమాధానం ఇవ్వడంలో సైతం దేవాదాయ శాఖ నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు.
భద్రాద్రి ప్రాంత పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు శంకర్‌రెడ్డి మాట్లాడుతూ... భద్రాచలంలో జరుగుతున్న కార్యక్రమంపై గతంలో నిరాహారదీక్షలు సైతం చేశామని గుర్తు చేశారు. సీతారాముల కల్యాణం పేర శుభలేఖలు పంచి ప్రభుత్వాన్ని సైతం తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి భద్రాచలంలో సీతారాముల కల్యాణం జరిగేలా చూడాలని కోరారు. సమావేశంలో స్వామి ఆత్మప్రియానంద సరస్వతి, కె.లత పాల్గొన్నారు.
